చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో ఇండియా రానున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగి బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే, ఇండియా-చైనాల మధ్య జరిగిన గాల్వాన్ ఘర్షణ తర్వాత జిన్‌పింగ్ ఇండియాలో పర్యటించనుండటం తొలిసారి అవుతుంది. 2020లో జరిగిన ఈ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పాక్షికంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది. ఈ రెండు రోజులపాటు జిన్‌పింగ్ ఇండియాలో పర్యటిస్తారు. భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతానికి జిన్‌పింగ్ రాక ఎంతగానో ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

జిన్‌పింగ్ 2013 నుంచి చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పదమూడేళ్లలో జిన్‌పింగ్ మూడుసార్లు మాత్రమే ఇండియాలో పర్యటించారు. చివరిసారిగా 2019, అక్టోబర్‌లో ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత 2020 నుంచి సరిహద్దు (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) విషయంలో వివాదం చెలరేగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో చైనా, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది.





























