Skip to main content

Namaste NRI

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ ఇకలేరు

టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏలూరులో పనిచేశారు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. మొత్తం 932కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన నటనకు గానూ రెండు ఫిల్మ్‌ఫేర్‌, ఆరు నంది అవార్డులు వరించాయి.

చంద్రమోహన్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన నటన ప్రేక్షకులకు మంత్రముగ్ధుల్ని చేసిందని ప్రధాని అన్నారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇంకా మంత్రులు హరీష్‌ రావు,  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి,   తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ రెడ్డి సంతాపం తెలిపారు.  సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విచారణ వ్యక్తం చేవారు.  చంద్రమోహన్‌ తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాల వారికీ చేరువయ్యారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సినీ ప్రముఖులు బ్రహ్మానందం, ఆర్‌.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్‌, పరుచూరి వెంకటేశ్వరావు  చంద్రమోహన్‌ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చంద్రమోహన్‌ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events