సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రారంభానికి ముందునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్‌లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది.