సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుడికి జాక్ పాట్ తగిలింది. ఒక్కటే రోజు వేటతో కోటి రూపాయలకు పైగా వచ్చిపడ్డాయి. మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌కు చెందిన చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడికి సముద్రం ఈ అదృష్టాన్ని ప్రసాదించింది. నెల రోజుల క్రితం పెట్టిన నిషేధం ఎత్తేయడంతో పాల్‌గఢ్‌కు చెందిన చంద్రకాంత్ మరో ఎనిమిది మంది కలిసి ఆగస్టు 28న హర్బా దేవి అనే బోట్‌లో సముద్రంలో వేటకు వెళ్లారు. సుమారు 25 నాటికల్ మైళ్ల దూరానికి వెళ్లాక చేపల కోసం వల వేశారు. సముద్రపు బంగారం గా చెప్పే 157 ఘోల్ ఫిస్ వలలో పడ్డాయి.
ఈ చేపల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. వీటికి హాంకాంగ్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఫార్మా కంపెనీలు వీటిని భారీ రేటుతో కొంటాయి. దీంతో పాల్‌గడ్‌లోని ముర్బే ప్రాంతంలో ఆ చేపలను వేలం వేయగా రూ.1.33 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. పొల్యూషన్ కారణంగా ఈ చేపలు మత్స్యకారులకు దొరకడం చాలా కష్టమైంది. ఈ చేప సైంటిఫిక్ పేరు ప్రొటోనిబే డియాకంథస్. మెడిసిన్స్, కాస్మొటిక్స్ తయారీతో పాటు ఆపరేషన్స్ చేసినప్పుడు శరీరంలో కరిగిపోయే లాంటి కుట్లు వేసేందుకు వాడే దారం కూడా ఈ చేపల నుంచి ఉత్పత్తి చేస్తారు.