కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ సత్యభామ . సుమన్ చిక్కాల దర్శకత్వం. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాజల్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
సత్య ఈ కేసు నీ చేతుల్లో లేదు. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సర్. అంటూ కాజల్ అగర్వాల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ చూస్తే హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.














