కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన యువతరం ప్రేమకథ చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకుడు. దర్శకుడు సాయిరాజేశ్ కథను అందించి, ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ట్రైలర్ చూశాను, చాలా బావుంది. 104రోజుల్లో సినిమా తీశారని చెప్పారు. అంటే నచ్చే దాకా తీశారన్నమాట. ఆ నమ్మకంతోనే కల్ట్ క్లాసిక్ అని పోస్టర్‌పై వేసుకున్నారు. ఈ టీమ్ నాకు తెలుసు. వీరి ప్రతిభ కూడా నాకు తెలుసు. అందుకే చెబుతున్నా, విజయం తథ్యం అని అన్నారు.

సినిమా మొత్తం కంప్లీట్ అయ్యింది. ైక్లెమాక్స్ ఈ కథకు కీలకం. అది బాగా రావాలని చాలా కష్టపడ్డాను. తలపై ఇరుముడి మోసే భక్తుడు, ఇరుముడి దించి మొక్కు చెల్లించాక ఎంత తేలిగ్గా ఫీలవుతాడో ఇప్పుడు నేనూ అలాగే ఫీలవుతున్నా. ట్రైలర్ నచ్చితే, సినిమా రెండింతలు నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజులున్నాయి. తెరపై చూసి షాక్ అవుతారు అని దర్శకుడు రవి నంబూరి చెప్పారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడే మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. నన్ను నమ్మండి. ఎప్పుడూ చూడని ఓ కొత్త ప్రేమకథను మీరు తెరపై చూస్తారు. బయటకు వచ్చాక కూడా ఆ ట్రాన్స్‌లో ఉండిపోతారు. సినిమా చూస్తూ ప్రతి ప్రేక్షకుడూ ఇంత బావుందేంట్రా అనుకుంటాడు’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా మరో అతిథి మైత్రీ రవిశంకర్, సాయిరాజేశ్, ఎస్‌కేఎన్, శ్రీగౌరీప్రియ, సహనిర్మాత ధీరజ్ మొగలినేని, త్రిగుణ్, మహేందర్, సిరి హన్మంతు, నరేశ్, పూజా, నవీన్ కూడా మాట్లాడారు. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.





























