మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ పర్యటన ఖరారైంది. మే 9వ తేదీన ఆయన భారత్‌కు వస్తున్నారు. ఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే.
భారత్‌పై పలువురు మంత్రులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో మాల్దీవుల నుంచి ఉన్నతస్థాయి అధికారి భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 9వ తేదీన జరగబోయే భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంతోపాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.