అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో బ్రిటన్ కొన్ని సడలింపులను ప్రకటించింది. భారత్, బ్రిటన్ మధ్య రాకపోకలు సాగించే వారికీ దీని వల్ల కొంతమేర వెసులుబాటు లభించనుంది. కొవిడ్ ముప్పు తీవ్రతను బట్టి వివిధ దేశాలను ఆకుపచ్చ, లేత పసుపు (జేగుర) ఎరుపు వర్ణాల్లో వర్గీకరించిన బ్రిటన్ అక్టోబర్ 4వ తేదీ నుంచి ఎర్ర రంగ జాబితాను మాత్రమే కొనసాగించనుంది. ప్రస్తుతం భారత్ జేగుర వర్ణ జాబితాలో ఉంది. ఇప్పుడు ఈ జాబితాను తొలగించడమంటే మన దేశం నుంచి వెళ్లే (టీకాలు పొందిన) ప్రయాణికులు బ్రిటన్ వెళ్లడానికి రెండు రోజుల ముందు, వెళ్లిన తర్వాత స్వల్ప ఖర్చుతో కూడిన కరోనా పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. అయితే, బ్రిటన్ గుర్తించిన టీకాల జాబితాలో సీరమ్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఇంకా చోటు దక్కలేదు. దీని వల్ల బ్రిటన్‌కు బయలుదేరే ముందు, అక్కడకు చేరుకున్న తర్వాత కరోనా నిర్ధరణకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.