కాంతార చిత్రానికిగాను ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికయ్యారు కన్నడ అగ్ర హీరో రిషబ్‌శెట్టి. కాంతార చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంతార సినిమా ప్రీక్వెల్ సన్నాహాల్లో ఉన్నారు రిషబ్‌శెట్టి. కాంతార మొదటి భాగం ముందు జరిగిన కథతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కనుంది.
భారీ హంగులతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు రిషబ్. యుద్ధ ఘట్టాలు, దక్షిణ కన్నడ ఆధ్యాత్మిక, దైవిక అంశాలతో ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు రిషబ్‌శెట్టి. ఇందులో ఆయన కత్తి, డాలు పట్టుకొని కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ సన్నాహాల్లో భాగంగా ఆయన యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడని చిత్రబృందం వెల్లడించింది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.