ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్‌లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఛార్లెట్‌లోని ఎన్నారై టీడిపి అభిమానులు, బిజెపి అభిమానులు, జనసేన అభిమానులతోపాటు తానా నాయకులు, ఇతర ప్రముఖులు ఈ అభినందన సభకు తరలివచ్చారు. వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 300 మంది రావడం, చాలామంది కుటుంబంతో కలిసి రావడం నిర్వాహకులను సంతోషపరిచింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సురేష్ కాకర్ల ఇక్కడకు తొలిసారి వచ్చిన సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సత్కారాన్ని మిత్రు లు, ఎన్నారై టీడిపి నాయకులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సురేష్ కాకర్ల అందరివాడని, సామాన్యవ్యక్తిగా ఉంటూ, తన గుణంతో, సేవతో నేడు ఎమ్మెల్యేగా ఎన్నికైనారన్నారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్‌గా ఉన్నప్పడూ ఎంతోమందికి సహాయాన్ని అందించారని, అలాగే స్నేహితునిగా పలువు రికి అవసరమైన సమయంలో ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండేవాడని కొనియాడారు. ఆయన సేవ, అందరితో కలిసిపోయే గుణమే ఆయనకు విజయాన్ని అందించిందని చెప్పారు. అలాగే ఉదయగిరిలో ఆయన కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సహాయాన్ని చేస్తున్నారని, ఇప్పుడూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అందరితోనూ చనువుగానే ఉంటూ వారికి అవసరమైన సేవలను అందిస్తున్నార న్నాని కొనియాడారు.
సురేష్ కాకర్ల మాట్లాడుతూ, తన గెలుపుకోసం ఎంతోమంది ఎన్నారైలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయాన్ని అందించడంతోపాటు విజయంకోసం కృషి చేశారని వారందరికీ తొలుత ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ఆత్మీయ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు, సన్నిహితులకు ఎన్నారై టీడిపి నాయకులకు, జనసేన, బిజెపి అభిమానులకు కూడా కృతఙతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతమని, భౌగోళిక విస్తీర్ణంలో పెద్ద నియోజక వర్గమని అంటూ ఇక్కడ సమస్యలు కూడా పెద్దగానే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగు నీరు, త్రాగునీరు కొరత ఉంది. నైపుణ్యంతో కూడిన 50 వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారన్నారు.
ఎన్నారైలు వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని సమస్యలను నేరుగా చూసి సహాయం చేయవచ్చని చెప్పారు. అలాగే ఎన్నారైలు ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉన్నాయని, వెనుకబడిన ఈ ప్రాంతములో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయసహకారాలను అందిస్తోందని చెప్పారు. ఎన్నారైలు ఉదయగిరి నియోజక వర్గమును సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, బాలాజి తాతినేని, సురేష్ జాగర్లమూడి, సతీష్ నాగభైరవ, ఛార్లెట్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు. ఈ కార్యక్రమంలో జనసేన తరుపున నగేష్, వీర తోట, కృష్ణ, ఎన్నారై జనసేన కార్యవర్గ సభ్యులు, బీజేపీ నుంచి సుభాష్ మరియు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.