సుందర్.సి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం బాక్. తమన్నా భాటియా, రాశీఖన్నా కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుందర్.సి విలేకరులతో ముచ్చటించారు. ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదాల్లో బాక్ అనే దెయ్యం ఉండేదట. ఆ దెయ్యానికి చెందిన కొన్ని విషయాలు నన్ను సర్‌ప్రైజ్ చేశాయి. అక్కడే ఈ కథకు బీజం పడింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉండే బాక్ అనే దెయ్యం మన ప్రాంతానికి వస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుం టాయి? అనే ఆలోచనతో ఈ కథ రాశాను. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించే సినిమా ఇది అని అన్నారు.
అరణ్మనై సీరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ పగ, ప్రతీకార నేపథ్యంలో ఉంటే, ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఈ కథలో భాగంగా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. గత మూడు చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. ఇందులో కొత్త తమన్నాను చూస్తారు. రాశీఖన్నా పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది అని తెలిపా రు. సవాలుగా తీసుకొని చేసిన సినిమా ఇదని, ఇందులో సీజీ వర్క్ అదిరిపోతుందని, విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఆయన చెప్పారు. సురేశ్, ఏషియన్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని, హిందీలోనూ సినిమాను విడుదల చేస్తున్నామని, ప్రేక్షకాదరణ లభిస్తే అరణ్మనై 5 కూడా ఉంటుందని సుందర్.సి అన్నారు.