భారత ప్రధాని నరేంద్రమోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం ఉక్రెయిన్ కు చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. మువ్వన్నెల జెండాలను ప్రదర్శించారు. ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. తమ మొబైల్ కెమెరాల్లో ప్రధాని వీడియోలు తీసుకున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ కానున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలతోపాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలెన్‌స్కీ తో సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.