యూకేలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయులను త్వరతిగతిన స్వదేశానికి తరలించేందుకు యూకే కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ను త్వరలో సురక్షిత దేశాల జాబితాలో చేర్చబోతున్నట్టు బ్రిటన్ తాజాగా ప్రకటించింది. అక్రమ వలసల నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ యాక్ట్-2023 లక్ష్యాలకు ఈ చర్య తోడ్పడుతుందని యూకే హోం శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లు పార్లమెంటుకు ముందు వచ్చిందని వెల్లడించింది. త్వరలో ఇమిగ్రేషన్ వ్యవస్థ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.భారత్‌ను సురక్షిత జాబితాలోకి చేర్చితే అక్రమమార్గాల్లో బ్రిటన్‌కు వెళ్లాలనుకునే వారికి దారులు మూసుకుపోతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సముద్ర మార్గంలో చిన్న చిన్న బోట్లలో వచ్చేవారు, భూమార్గంలో అక్రమంగా ప్రవేశించే భారతీయ శరణార్థులకు బ్రిటన్‌లో ఆశ్రయం దక్కదని అంటున్నారు. స్వదేశంలో అణచివేత పేరు చెప్పి బ్రిటన్‌లో ఆశ్రయం కోరే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా, దీనిపై అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. భారత్‌లో ప్రమాదమేమీ లేకపోయినా శరణార్థులుగా అక్రమమార్గాల్లో బ్రిటన్‌కు చేరే వారి రాకడకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది.














