వరుణ్‌తేజ్ హీరోగా నటించిన నూతన సినిమా కొరియన్ కనకరాజు. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నిర్మాతలు అంటే దర్శకులకు భయం భక్తి ఉండాలి. పరిమిత బడ్జెట్లో సినిమాలు తీయాలి. భారీ బడ్జెట్‌తో తీస్తేనే పెద్ద సినిమాలు కావు. మంచి కంటెంట్‌పై దృష్టి పెడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వరుణ్‌తేజ్ మొదటి నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా ప్రతి సినిమాతో తనని తాను నిరూపించుకుంటున్నాడు అన్నారు.

ఇలాంటి విజయాలను మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. దర్శకుడు మేర్లపాక గాంధీ జనాలకు నచ్చే అద్భుతమైన కంటెంట్‌ను అందించాడు. హారర్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఈ సినిమాలో కొరియన్ ప్లేవర్‌ను, కల్చర్‌ను తీసుకురావడం అద్భుతమైన ఆలోచన. అదే సినిమా విజయానికి ప్రధాన కారణం. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి వరుస విజయాలు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ సినిమాలు నిరూపించాయి అన్నారు. ఈ సినిమా ద్వారా మెగాఫ్యాన్స్‌కు మంచి విజయాన్ని అందించానని గర్వంగా ఉందని వరుణ్‌తేజ్ పేర్కొన్నారు.





























