Skip to main content

Namaste NRI

అదే ఎనర్జీ ఈ సినిమాలో చూస్తారు : సూర్య

సూర్య కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య మాట్లాడారు. తెలుగువారితో నాది 28ఏండ్ల బంధం. వారిని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా చేశాను. మానవబంధాలపై తీసిన గొప్ప సినిమా ఇది. నా కెరీర్‌లోనే ఇది ప్రత్యేకం. గజనీ నాటి ఎనర్జీని మళ్లీ ఈ సినిమాలో చూస్తారు. సిన్సియర్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. ముఖ్యంగా తను గొప్ప రచయిత. అద్భుతమైన పాత్రలను సృష్టించారు. నిర్మాతలు ఓ అందమైన ప్రపంచాన్నే ఆవిష్కరించారు. టీమ్‌ అంతా ప్రేమతో పనిచేశారు. సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ ని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే ఈ విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ నమ్మకంగా చెబుతున్నా. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్‌ ముఖంపై చిన్న చిరునవ్వు కచ్ఛితంగా ఉంటుంది. సినిమా ఇంతబాగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. 20ఏండ్లుగా సూర్యసార్‌ సినిమాలు చూస్తూ ఎదిగాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను. ఇది నేను ఓ ఫ్యాన్‌ బోయ్‌గా చేసిన సినిమా అని చెప్పారు. సూర్యసార్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అద్భుతమైన టీమ్‌తో పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు కథానాయిక మమితాబైజు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలతోపాటు రాధిక శరత్‌కుమార్‌, కె.ఎల్‌.నారాయణ, మైత్రి రవిశంకర్‌, శాసనసభ్యులు నవీన్‌ యాదవ్‌, రామజోగయ్యశాస్త్రి, సునీల్‌రెడ్డి, బీవీఎస్‌ఎన్‌ రవి, విజయ్‌ బిన్నీ, హైపర్‌ ఆది తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News