సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సౌదీలోని ఎయిర్పోర్టులే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాకు చెందిన విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి సౌదీకి, అలాగే సౌదీ నుంచి ఇండియాకు వచ్చే విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. అక్టోబర్ 17 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది.

సౌదీ రాజధాని రియాద్, జెద్దా, దమ్మాం, మదీనా ఎయిర్పోర్టుల నుంచి ఇండియాకు, ఇండియా నుంచి ఆ ఎయిర్ పోర్టులకు ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం సౌదీలో నెలకొన్న ఆందోళనకర పరిస్తితుల నేపథ్యంలో ఇండిగో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించింది. అలాగే, పూర్తి వివరాల కోసం, విమాన సర్వీసుల కోసం సంస్థ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ప్రయాణికుల అభ్యంతరాలపై సమాచారం అందించేందుకు సపోర్ట్ టీం అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.















