అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం వైఎస్ జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసుపై సీబీఐ న్యాయస్థానంలో గత రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని, అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని, కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిసన్‌ను కొట్టివేసింది.