Skip to main content

Namaste NRI

డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అంగరంగ వైభవంగా.. గాంధీజీ 157వ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజిఎంఎన్ టి) ఆధ్వర్యంలో గాంధీజీ 157వ జయంతి వేడుకలు అమెరికాలోని డాలస్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాంతి నడక యాత్ర ప్రవాస భారతీయుల విశేష భాగస్వామ్యంతో శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల హాజరై ప్రసంగించారు. గత 12 సంవత్సరాలుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పార్కులో శాంతి యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోయినా, వందలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఎన్ఆర్ఐల కృషి అభినందనీయమని కొనియాడారు. అమెరికాలోనే అతిపెద్ద గాంధీ మెమోరియల్ ఇక్కడ ఉండటం తమ నగరానికే గర్వకారణమని పేర్కొంటూ గాంధీజీకి నివాళులర్పించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేష్ ప్రేమకుమార్, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ అందించిన నాయకత్వాన్ని స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలోనూ గాంధీజీ సిద్ధాంతాలు, అహింసా మార్గం ఎంతో ఆచరణీయమని నొక్కిచెప్పారు. శాంతియుత ప్రతిఘటనతో ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చని ప్రపంచానికి చూపిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా వంటి ఎందరో జగద్విఖ్యాత నాయకులు గాంధేయ మార్గం నుంచే ప్రేరణ పొందారని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి సైతం అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడమే ఆయన తాత్విక చింతనకు ఉన్న సార్వజనీనతకు నిదర్శనమన్నారు.

ప్రముఖ గాంధేయవాది, బోర్డు సభ్యులు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ రచించిన ద పెరల్స్ ఆఫ్ గాంధీజీస్ విజ్డమ్ గ్రంథాన్ని డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉపాధ్యక్షులు దీపక్ కాల్రా, బోర్డు సభ్యులు రావు కల్వాల, తయాబ్ కుండావాల, రాంకీ చేబ్రోలు, శైలేష్ షా, స్వాతీ షా, ముర్తుజ, కలై కృష్ణ, వినోద్ ఉప్పు, శాంటే చారి, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అతిథులను ఘనంగా సత్కరించిన అనంతరం, శాంతికి ప్రతీకగా 10 శ్వేత కపోతాలను (తెల్ల పావురాలు) ఆకాశంలోకి ఎగురవేశారు.

అనంతరం ఇండియా టుడే సౌత్ లేక్ రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన అల్పాహారంతో వేడుకలు ముగిశాయి. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన కార్యకర్తలకు, అధికారులకు, విరాళాలు మరియు అల్పాహారం అందించిన ఇండియా టుడే యాజమాన్యానికి డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events