Skip to main content

Namaste NRI

విశాఖలో పెట్టుబడుల జాతరకు సర్వం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పరిశ్రమలు, పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII) సంయుక్తంగా నవంబర్ 12, 13 తేదీల్లో ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తున్నాయి. నవంబర్ 12న ఉదయం 10:30 గంటలకు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని మౌలిక వసతులు, తయారీ, సాంకేతిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం చంద్రబాబు స్వయంగా వివరించనున్నారు.

ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు గ్లోబల్ ప్రతినిధులతో కీలక భేటీలు జరపనున్నారు. సింగపూర్, యూఏఈ, గ్వాటెమాలా, స్లోవేకియా దేశాల ప్రతినిధులు, జపాన్, రష్యా రాయబారులతో పాటు ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. అలాగే కియా మోటార్స్, రెన్యూ, మాండెలెజ్ ఇండియా, సెయింట్ గోబెయిన్, నాల్కో, లెవిస్టా వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలు ఈ వేదికపై సందడి చేయనున్నారు. ఇక స్పేస్ టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తూ హాథోర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్, స్కైరూట్ వంటి స్టార్టప్ ప్రతినిధులతో సీఎం భేటీ కావడం ఈ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మరోవైపు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విశాఖ నోవోటెల్‌లో ‘విమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్ వంటి పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సాయం, పారిశ్రామిక రాయితీలను కోరనున్నారు. ఇప్పటికే బుధవారం నుంచే దౌత్యవేత్తలతో సీఎం వరుస చర్చలు మొదలుపెట్టగా, ఈ సదస్సు ద్వారా విశాఖ వేదికగా ఏపీ పారిశ్రామిక ముఖచిత్రం మారనుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events