ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 విజయవంతమైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా 303 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 66 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.

వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తి చూపించారని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలబెట్టే ప్రయత్నం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు అవి క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.















