శరవేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు హెచ్చు స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్ ఇచ్చింది. దీంతో జాతీయ ఆరోగ్య వ్యవస్థలపై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. టెడ్రోస్ గేబ్రియాసిస్ మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేగాన్ని గమనిస్తే ఆందోళన కలుగుతోందన్నారు. ఇప్పటికే డెల్టా కేసులూ ఉన్నాయని, దీంతో పాజిటివ్ కేసుల సునామీ తప్పదని ఆయన హెచ్చరించారు. ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వల్ల మళ్లీ ప్రజల జీవితాలపై పెను భారం తప్పదన్నారు. హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో పాటు హెల్త్ వర్కర్లు కూడా భారీగా అస్వస్థతకు లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ అంచనా వేశారు. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత లేదని నిర్లక్ష్యంగా ఉండరాదని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఒమిక్రాన్ యువతకు ఎక్కువగా సోకుతోందని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.














