తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన పర్యటన చివరి రోజున పెట్టుబడుల వరద పారింది. ఒక రోజున నాలుగు ప్రధాన సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడిరచాయి. ఫార్మా, లైఫ్‌సైన్సెస్ ఎదుగుదలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆ సంస్థలకు మంత్రి కేటీఆర్ వివరించారు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ నాలుగు ప్రఖ్యాత కంపెనీలు దాదాపు రూ.3,250 కోట్ల పెట్టుబడులకు సంబంధింంచిన ప్రకటనలు చేశాయి.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న అడ్వెండ్ ఇంటర్నేషనల్ కంపెనీ తెలంగాణలో ఫార్మా రంగంలో రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మంత్రి కేటీఆర్ అడ్వెంట్ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్‌ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్ సంస్థల్లో మెజారిటీ వాటాలు కొనేందుకు రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఈ సందర్భంగా మాల్డోనాడో తెలిపారు. ఆర్‌ఏ కెమ్ సంస్థ ఔషధాల్లో ప్రభావవంతమైనవిగా పరిగణించే పెల్లెట్స్ తయారీతో పాటు బీ టూ బీ ఫార్ములేషన్స్, క్లినికల్ స్టడీస్ రంగంలో పనిచేస్తున్నది. 1984లో స్థాపించిన అడ్వెంట్ కంపెనీ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక, రిటైల్, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో సుమారు రూ.4,60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో 20 మిలియన్ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. సీజీఎంపీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది. గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో స్లేబ్యాక్ సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం తరువాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్ సింగ్ ఈ భారీ ప్రకటన చేశారు. హైదరాబాద్ ఫార్మా రంగంలోకి యునైటెడ్ స్టేట్స్ ఫార్మా కొపియా సంస్థ కూడా చేరనున్నది. రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషద తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని జీనోవ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్టు ఈ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కేవీ సురేంద్రనాథ్ తెలిపారు.
ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న పలు కంపెనీల నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం సహకారంతో ఫార్మా కంపెనీలు మరింత సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో వాణిజ్య శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ ఉన్నారు.














