వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ విలక్షణమైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతూనే కీలకపాత్రలలో కూడా నటించడానికి సిద్ధంటా ఉంటున్నాడు. నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్. విజయ్ సేతుపతి కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రం బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్లో కేక్ కట్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విఘ్నేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని సాధ్యం చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు. అత్యద్భుతమైన ప్రతిభావంతులతో అసాధారణ నటులతో పని చేయాలని ప్రతి దర్శకుడు కలగంటాడు. నా కల ఈ చిత్రంతో నెరవేరింది. విజయ్ సేతుపతి, నయతతార, సమంత ఇలా ప్రతి ఒక్కరూ సినిమాని అద్భుతంగా వచ్చేలా చేశారు. రాంబో, కల్యాణి, ఖతీజాల మధ్య జరిగే ముక్కొణపు ప్రేమ కథతో ఈ చిత్రాన్ని రూపొందించా. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. ఈ సినిమా తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల కానుంది. రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.














