భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురజాత్‌లో పర్యటించారు. సబర్మతీ ఆశ్రమంలో ఆయన కాసేపు గడిపి చరఖాతిప్పి నూలు వడికారు. చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని మహిళలు ఆయనకు వివరించారు. విజిటర్స్ పుస్తకంలో ఆయన తన అనుభవాన్ని రాశారు. సబర్మతీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మహాత్మా గాంధీ సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ఎలా పోరాడాలో తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ లండన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. తొలిసారి భారత్‌కు వచ్చిన బోరిస్ జాన్సన్ ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ఆయన సమావేశం అవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆయన భారత ప్రభుత్వంతో చర్చిస్తారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనపై పలు అంశాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరుపుతారు.














