ఈ నెల 7వ తేదీ టర్కీ-సిరియా సరిహద్దులో సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఐరాస అత్యవసర, సహాయక చర్యల చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్, ఖహ్రమాన్‌మరాస్ ప్రావిన్స్‌లో మీడియాతో మాట్లాడారు. టర్కీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ చర్యలపై గ్రిఫిత్స్ ప్రశంసలు కురిపించారు. విపత్తు నిర్వహణ చర్యల విషయంలో టర్కీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అసాధారణంతా ఉందని ఆయన కొనియాడారు. సిరియాలో కూడా ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వ వ్యతిరేకుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని భావిస్తున్నానని, అయితే ఈ విషయంలో తనకు పూర్తిగా క్లారిటీ లేదని ఆయన చెప్పారు.














