అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. తనను ట్రంప్ లైంగికంగా వేధించాడని కారోల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 1990లో మాన్‌హట్టన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. కారోల్ ఆరోపణలపై రెండు వారాల క్రితం విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ ట్రంప్‌ను దోషిగా పేర్కొంది. ఈ మేరకు ఆమెకు 50 లక్షల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాగా, కారోల్ విషయంలో తాజాగా తన నోటిదురుసుతో ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. జ్యూరీ తీర్పు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ కారోల్ పరువుకు నష్టం కలిగించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అన్నీ కట్టుకథలే అంటూ కొట్టిపారేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై కారోల్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. కొత్తగా ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసింది.

















