తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ( టీటీఏ) మెగా కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ విజయ వంతంగా కాగా, రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రోజు పండుగ లాంటి టీటీఏ కన్వెన్షన్ ఘనంగా ముగిసింది. కన్వెన్షన్ మూడో రోజున ఉదయాన్నే తెలంగాణ రాష్ట్రం, భధ్రాచలం నుంచి విచ్చేసిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణో త్సవం శుభప్రదంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం అందరూ ప్రసాదం అందుకున్నారు. వివిధ ఎక్సిబిట్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. టీటీఏ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, వివిధ పార్టీల ఫాన్స్ సమావేశాలు, బిజినెస్ సెమినర్స్, ఇన్ప్లుయెన్సర్ మీటింగ్, ఫిట్నెస్ వర్క్‌షాప్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు.


తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క, ఓరుగల్లు కోట, పోతురాజు, చార్మి నార్, తెలంగాణ తల్లి వంటి సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు షాపింగ్ బూత్స్ దగ్గర కోలా హలంగా తిరిగారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వీనుల విందుగా ఉన్నాయి. 25కే, 50 కే, 100 కే డోనార్స్ ని కార్పొరేట్ స్పాన్సర్ ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజంట్, టీటీఏ స్టార్ విజేతలకు క్రౌన్, బహుమతులు పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, తెలుగు సినీ నిర్మాత దిల్‌రాజు, టాలీవుడ్ నటి శ్రీలీల తదిరులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సమితి వ్యవస్థాపకులు డా. ప్రేమ్ రెడ్డికి టీటీఏ కార్యవర్గం, బోర్డు సభ్యులు, నాటా లీడర్ షిప్ సమక్షంలో టీటీఏ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా డా. ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు. డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ని వేదికపైకి సాదరంగా ఆహ్వానించి శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా క్రౌడ్ డాన్స్ చేయాలని కోరగా, సున్నితంగా తిరస్కరించి, తనదైన స్టైల్‌లో సినిమా డైలాగులు చెప్పి నవ్వులు పూయించారు. యంకర్స్ సుమ, రవి అందరినీ నవ్విస్తూ కార్యక్రమాలను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. యువత శ్రీలీల, డీజీ టిల్లు తో సెల్ఫీలు దగడానికి ఎగబడడంతో సెక్యూరిటీ వాళ్ళు కొంచెం కష్టపడాల్సి వచ్చింది.


టీటీఏ ప్రస్తుత అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజుల ను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ కన్వెన్షన్ కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. చివరిగా తెలుగు సినీ సంగీత దర్శకులు తమన్ థండర్ మ్యూజికల్ కాన్సర్ట్ తో యువతను అలరించారు. దీంతో టీటీఏ సియాటెల్ కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్లైంది.

















