జి 7 శిఖరాగ్ర సదస్సు ఔట్రీచ్ సెషన్లో పాల్గొనేందుకు భారత ప్రదాని నరేంద్ర మోడీ ఇటలీకి బయలు దేరారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మోడీ తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ నేపథ్యంలో ప్రధాని తమ ప్రకటన వెలువరించారు. కృత్రిమ మేధ(ఎఐ), ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం వంటి కీలక విషయాలు ఈ వేదిక నుంచి ప్రస్తావనకు వస్తాయని ఆయన వివరించారు.
ప్రధాని ఇటలీ పర్యటన ఇంతకు ముందే ఖరారు అయింది. జి 7 సదస్సులో గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన పలు విషయాలు ప్రస్తావనకు వస్తాయని తెలిపారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలో ఉన్న విలాసవంత మైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఇటలీ ప్రధాని జియోజియా మెలోని ఆహ్వానం మేరకు తాను వెళ్లుతున్నానని కూడా ప్రధాని తెలిపారు. జి 7 వేదికలో అమెరికా , బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.