అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తానే స్వయంగా కొత్త సోషల్ నెట్వర్క్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దాని పేరు ట్రూత్ సోషల్. ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) దీనికి యజమానిగా ఉంటుంది. వచ్చే నెలలో కొందరు ప్రత్యేక ఆహ్వానితులతో ఈ సోషల్ నెట్వర్క్ బీటా వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆపిల్ సంస్థ యాప్ స్టోర్‌లో ఇది ప్రిఆర్డర్పై అందుబాటులో ఉంది. ఈ ఏడాది జనవరిలో క్యాపిటల్ హిల్‌పై దాడి తర్వాత ట్విటర్, ఫేస్బుక్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచీ ఆయన సొంత నెట్వర్క్ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడీ ట్రూత్ సోషల్‌తో పాటు ఓ వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించాలని టీఎంటీజీ భావిస్తోంది. పెద్ద టెక్ కంపెనీల నిరంకుశత్వానికి దీటుగా నిలబడేలా ఈ ట్రూత్ సోషల్ను సృష్టించినట్లు ట్రంప్ తెలిపారు. 2022 మొదటి త్రైమాసికంలో కంపెనీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తాలిబన్లకు కూడా అవకాశం ఉన్న ట్విటర్లో మీకు ఎంతో ఇష్టమైన అమెరికా అధ్యక్షుడికి స్థానం లేకుండా పోయింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని ట్రంప్ స్పష్టం చేశారు.














