సామాజిక మాధ్యమాల్లో తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ చానళ్లతోపాటు డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై సిని నటి సమంత దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరపున వ్యాయవాది కోర్టును కోరారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ ప్రసారాలు తన కక్షిదారులను అవమానించేలా, ఆమె జీవన హక్కును ఉల్లంఘించేలా ఉన్నాయని సమంత తరపు న్యాయవాది వాదించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా సమంతపై, ఆమె కుటుంబ జీవితంపై తప్పుడు ఆరోపణలు చేసే హక్కు ప్రతివాదులకు లేదని పేర్కొన్నారు. సమంత పరువుకు భంగం కలిగించేలా తప్పుడు వ్యాఖ్యలు, ప్రసారాలు చేయకుండా ప్రతివాదులను నిలువరించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసు ఎందుకు ఇవ్వలేదని న్యాయస్థానం ప్రశ్నించగా నోటీసు ఇవ్వాలిసిన అవసరం లేదని సమంత తరపున న్యాయవాది తెలిపారు. కేసు త్వరగా విచారించాలని కోరారు. దీనిపై స్పందిస్తూ సామాన్యులైనా, సెలబ్రిటీలైనా తమకు ఒక్కటేనని స్పష్టం చేసి, తీర్పును వాయిదా వేసింది.














