ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వెల్లడించారు. ఈ నెల 16లోపు ఆయిల్ విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.

దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురుకు సంబంధించి ఇలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు.. చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరల్ని తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) పర్యవేక్షిస్తుంది.















