మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని సంజయ్ కిశోర్ రచించిన సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ పుస్తకాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సీనియర్ నటి జయప్రద పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలిప్రతిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి అందించారు. పుస్తక రచయిత సంజయ్ కిశోర్ మాట్లాడుతూ ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు అని ఆత్రేయ అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగుసినీ చరిత్రలో ఏ కథానాయికకూ ఊరూరా విగ్రహాలు లేవు. అది సావిత్రి విషయంలోనే సాధ్యమైంది. చిరంజీవి తన సొంత ఖర్చుతో గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించి తెలుగు బుక్‌ని లాంచ్ చేశారు. ఈ ఇంగ్లిష్ అడిషన్‌ని జయప్రద లాంచ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

సావిత్రి పేరిట రాసిన బుక్‌ని ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం. ఉత్తమ నటనకు చిరునామా సావిత్రి. ఆమె ఓ అద్భుతం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులకు ధీటుగా నటించిన మేటి నటీమణి సావిత్రి అంటూ జయప్రద కొనియాడారు. తెలుగు అడిషన్‌కి మంచి స్పందన వచ్చిందని, ఈ బుక్‌ని ఇంగ్లిష్‌లో అనువదిస్తే మరింతమందికి చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ ఇంగ్లిష్ అడిషన్‌ని తీసుకొచ్చామని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి చెప్పారు. సావిత్రి ప్రాతఃస్మరణీయులు కారు చిరస్మరణీయురాలని, అలాంటి వారికి మరణం ఉండదని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్, కేఐ వరప్రసాద్‌రెడ్డి, నిర్మాత నాగసుశీల, జయలలిత, బొల్లినేని కృష్ణయ్య కూడా మాట్లాడారు.





























