మాధవ్ హీరోగా మంచాల నాగరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం మారెమ్మ. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. గీత రచయిత మిట్టపల్లి సురేందర్ రాసిన బావ బావ మారి అనే పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. గురువారం మిట్టపల్లి సురేందర్ పాత్రికేయులతో సినిమా పాటల విశేషాల్ని పంచుకున్నారు. మారి అన్నది సినిమాలో హీరో ఆడుకునే ఆవుదూడ పేరు. దాని చుట్టూ భావోద్వేగాన్ని, బంధాన్ని అల్లుకొని పాట రాయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ పాట రాస్తున్నప్పుడు నా బాల్యం గుర్తుకొచ్చింది. బొబ్బిలి రాజా లో బసవన్న పాటలా ఓ మైలురాయిలాంటి పాట రాయాలనే సంకల్పంతో ఈ గీతాన్ని రచించాను.

ఈ సినిమా కథ నన్నెంతగానో కదిలించింది. దర్శకుడు కథ చెప్పినప్పుడు ైక్లెమాక్స్ వచ్చేసరికి ఆయనతో పాటు నేను కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చాను. సినిమాలోని మొత్తం ఆరు పాటల్లో నాలుగు పాటలు నేనే రాశాను. ఏ పాట రాసినా కుటుంబం మొత్తం కలిసి వినేలా ఉండాలన్నది నా సిద్ధాంతం. అలాంటి పాటలు రాయడానికే ఇష్టపడతాను. మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేదు. రెండు పడవల ప్రయాణం వద్దనుకుంటున్నా. సినిమా పాటలపైనే దృష్టి పెట్టాను. ప్రస్తుతం దాదాపు పది సినిమాలకు పాటలు రాస్తున్నా. ఇడుపు కాయితం, జిల్లేడు చెట్టు, దేత్తడి, డేవిడ్ రెడ్డి వంటి సినిమాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. సినీరంగంలో వేటూరి, చంద్రబోస్‌గార్లు నాకు స్ఫూర్తినిచ్చారు.





























