Skip to main content

Namaste NRI

అమెరికా లో 11 మంది భారతీయులు అరెస్ట్‌

అమెరికా లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డుల కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దోపిడీ బాధితులం అంటూ కట్టుకథలు అల్లి యూ-వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అయితే, హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ-వీసా (నాన్‌ ఇమిగ్రేషన్‌ స్టేటస్‌) కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాతో వలసదారులకు పని అనుమతులతో పాటు 5-10 ఏళ్లలో గ్రీన్‌కార్డు పొందేందుకు మార్గం దొరుకుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యూఎస్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

ఈ కేసులకు సంబంధించి మసాచుసెట్స్‌, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో 11 మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో ఓ వ్యక్తిని భారత్‌కు డిపోర్ట్‌ చేయగా మరో ఆరుగురిని కోర్టులో హాజరుపర్చి విడుదల చేశారు. మిగతా నలుగురిని రిమాండ్‌లో ఉంచారు. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారంట్లు, మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద దోపిడీలు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనల్లో తాము బాధితులమంటూ నమ్మించి యూ వీసాలకు దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో నేర నిర్ధారణ అయితే నిందితులకు ఐదేళ్ల వరకు జైలుశిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events