ఇరాన్, అమెరికా మధ్య ఆకస్మికంగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం బయటికొచ్చింది. చర్చలకు ఇరాన్‌ను అంగీకరించేలా చేయడంలో చైనా కీలక పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు. చైనా చొరవ చూపి ఉండకపోతే ఒప్పందం సాధ్యపడేదే కాదని కూడా ఆయన అన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం వెనుక తన ప్రమేయంపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆ దేశం తెర వెనుక దౌత్యం నెరిపింది. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ఇరాన్‌కు తన సందేశాన్ని పంపింది. ఘర్షణ మరింత తీవ్రమైతే పశ్చిమాసియాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా అపార నష్టం జరుగుతుందని ఆయా దేశాల ద్వారా ఇరాన్‌కు నచ్చచెప్పింది.

అయినప్పటికీ అది తన పాత్రను అధికారికంగా చెప్పుకోలేదు. అన్ని పక్షాలు చిత్తశుద్ధిని కనబరచాయని, ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేందుకు కృషి చేశాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణగా అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకోవాలంటూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి రష్యాతో పాటు చైనా కూడా వీటో చేసింది. ఈ చర్యపై ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చైనా ఇక్కడ రెండు రకాల వ్యూహాన్ని అనుసరించింది. ఒక వైపు అమెరికా నేతృత్వంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూనే మరో వైపు శాంతి కోసం తెర వెనుక ప్రయత్నాలు చేసింది.















