పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి సాధ్యమైనంత మద్దతును ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు షేక్ మొహమద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరిపినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల సందర్భంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత, నౌకాయాన రంగాలపై వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన కీలక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

భారత్‌లో 5 బిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ అంగీకరించిందని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ముడి చమురు సరఫరాకు సంబంధించి అబు దాబి నేషనల్ ఆయిల్ కో కంపెనీతో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ లిమిటెట్ ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌కు ఎల్పీజీ సరఫరా ఒప్పందంపైనా ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. పశ్చిమాసియా యుద్ధంలో యూఏఈని లక్ష్యంగా చేసుకోకూడదని మోదీ ఈ సందర్భంగా అన్నారు. సంక్షోభ నివారణలో ఆ దేశం పాత్రను ఆయన కొనియాడారు.





























