పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు దైపాక్షిక, దౌత్యపరమైన చర్చలు మాత్రమే మార్గం అని అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు ఇండియా ఎలాంటి నిర్మాణాత్మక ప్రతిపాదనతో వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు. ప్రాంతీయ శాంతి భద్రతల్ని ప్రభావితం చేసే శక్తి ఇండియాకు ఉందని అన్నారు. ఈ విషయంలో భారత్ అర్థవంతమైన ప్రతిపాదనతో వస్తే మద్దతు తెలుపుతామని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్దానికి సైనిక చర్య ఎంతమాత్రం పరిష్కారం కాదన్నారు. హార్ముజ్ వద్ద పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అయితే, ఇక్కడి నుంచి నౌకలు సురక్షితంగా కదిలేందుకు ఎలాంటి సాయం అందించడానికైనా ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

అమెరికాపై విశ్వాసం లేకపోవడం వల్లే చర్చలు పురోగతి సాధించడం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికాను తాము నమ్మకపోవడానికి పలు కారణాలున్నాయని, అయితే, అమెరికాకు మాత్రం ఇరాన్‌పై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. 40 రోజుల యుద్దం తర్వాత కూడా అమెరికా ఎలాంటి లక్ష్యాన్ని సాధించలేదని, అందుకే ఇరాన్‌తో చర్చలకు ప్రతిపాదించారని, తమకు అమెరికన్లపై నమ్మకం లేదని చెప్పుకొచ్చారు.





























