ఓటర్లు పశ్చాత్తాప పడే పనులు చేయొద్దని బ్రిటన్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ సూచించారు. ఈ నెల నాలుగో తేదీన బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు పలు ప్రాంతాల్లో రిషి సునాక్ సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని మెజారిటీ సర్వేలు చెబుతుండటం తో రిషి సునాక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సర్వేలను విశ్వసించి లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తే దేశంపై పన్నుల భారం తప్పదు. ఇదే పదవిలో నేను కొనసాగడం ద్వారా ప్రజల పన్నులు, వారి పెన్షన్లు, సరిహద్దులను రక్షిస్తా. మీరు తీసుకునే నిర్ణయం మళ్లీ వెనక్కి రాదు. పశ్చాత్తాప పడే పని చేయొద్దు అని రిషి సునాక్ చెప్పారు.
తాజా సర్వేల అంచనాలతో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే తమకు ప్రతి ఓటూ ముఖ్యమేనన్నారు. ఇప్పటికే దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆరోపించారు. తాము ఒకవేళ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వానికి అన్నీ సవాళ్లే ఉంటాయన్నారు. గత 14 ఏండ్లుగా ఏ పురోగతి లేదన్నారు.