Namaste NRI

సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఇకలేరు

 ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఏచూరి వయసు 72 ఏండ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏచూరి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఎయిమ్స్‌కు దానం చేస్తున్నట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. అంతకుముందు ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

సీతారాం ఏచూరి పూర్వ మద్రాస్‌ రాష్ట్రంలో 1952 ఆగస్టు 12న తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీఎస్‌ఆర్టీసీలో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ ఉద్యోగి. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన మోహన్‌కందాకు ఏచూరి మేనల్లుడు. పుట్టింది మద్రాస్‌లోనే అయినా ఆయన హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి సీబీఎస్‌ఈ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించారు. ఢిల్లీలోనే సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో బీఏ (ఆనర్స్‌), జేఎన్‌యూలో ఎంఏ చదివారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయిన కారణంగా ఆర్థిక శాస్త్రంలో ఆయన పీహెచ్‌డీని పూర్తిచేయలేకపోయారు. ఏచూరి భార్య సీమా చిస్తీ ది వైర్‌ వెబ్‌ పోర్టల్‌కు సంపాదకురాలు కాగా, కుమార్తె అఖిల ఏచూరి ఎడిన్‌బర్గ్‌, సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.

సీపీఎం విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో ఏచూరి 1974లో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే ఆయన సీపీఎం సభ్యుడయ్యారు. ఎమర్జెన్సీ తరువాత 1977-78లో జేఎన్‌యూ విద్యార్థి యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు. తన సహచర కామ్రేడ్‌ ప్రకాశ్‌ కారత్‌తో కలిసి జేఎన్‌యూను దుర్భేద్యమైన వామపక్ష కోటగా నిర్మించేందుకు కృషి చేశారు. 1986 వరకు ఎస్‌ఎఫ్‌ఐలో కొనసాగిన ఏచూరి 1978లో ఆ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు అయ్యారు. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్న ఏచూరి 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభలలో సీపీఎం ఐదో ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2018, 2022లో జరిగిన పార్టీ మహాసభల్లో తన పదవిని నిలబెట్టుకున్నారు. 2005 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో ఉత్తమ పార్లమెంటే రియన్‌గా ఎంపికయ్యారు.వామపక్ష నేత మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events