సింగపూర్‌లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్‌లో కనిపించింది. పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించిన సింగపూర్ పోలీసులు, అతని స్నేహితులను విచారిస్తున్నారు. ఒక్కడే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోదాడ పట్టణానికి చెందిన పవన్ ఏడాదిన్నర క్రితం సింగపూర్ వెళ్లాడు. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో తాత్కలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో జూలై 5వ తేదీన సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లాడని, అక్కడే అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోయి మరణించాడని పవన్ స్నేహితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కోదాడలోని పవన్ తల్లిదండ్రులకు తెలియజేశారు. మృతుడు పవన్ తండ్రి శ్రీనివాసరావు కోదాడలో పల్లి నూనె వ్యాపారం చేస్తున్నాడు. సోదరుడు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కూడా రెండు నెలల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇలా జరగడంతో పవన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పవన్ మృతదేహాన్ని తొందరగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.