ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో సంభవించిన వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలతో ముందుకొచ్చారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. సభ్యులు అందించే విరాళాలతో పాటు అసోసియేషన్ ఫండ్ నుంచి కొంత జతచేసి రెండు రాష్ర్టాలకు 15 లక్షల వరకు విరాళాల్ని అందించబోతున్నామని తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ రావు తెలిపారు. ఎలాంటి ప్రకృతి విపత్తులు జరిగినా సహాయం అందించడానికి తమ అసోసియేషన్ ముందుంటుందని సెక్రటరీ వినోద్‌బాల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత ప్రభాకర్, శ్రీరామ్ పాల్గొన్నారు.