చారిత్రక వీరుడు, బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం సర్దార్ సర్వాయి పాపన్న. స్వీయ దర్శకనిర్మాణంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఆర్కే ఫిలింస్ ద్వారా ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మన రాజాన్ని మనమే పాలించుకోవాలని పోరాటం సాగించిన ధీరుడు సార్దార్ సర్వాయి పాపన్న. ఆయన చరిత్రతో సినిమా రూపొందించడం అభినందనీయం అన్నారు. బహుజనుల రాజ్యమే లక్ష్యంగా, గోల్కొండ కోట వరకూ సర్దార్ సర్వాయి పాపన్న సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఈ నెల 18న ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం అన్నారు.

ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న అలుపెరుగని పోరాటం చేశారని, ఆయన వీరత్వానికి అద్దంపట్టే చిత్రమిదని అన్నారు. సర్వాయి పాపన్న అణగారిన వర్గాల నుంచి పుట్టిన వీరుడని, ఔరంగాజేబ్, నిజాం నవాబులకు ఎదురొడ్డి 30ఏళ్లు స్వతంత్య్ర రాజుగా పాలన సాగించారని, ఢిల్లీకే సవాలు విసిరిన యోధుడు ఆయన అని దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా, విజువల్ డైరెక్షన్: మిర్జాపురి సైమన్, మ్యూజిక్ సూపర్‌వైజర్, సాహిత్యం, నిర్మాత, దర్శకత్వం: వెంకటేష్ గౌడ్ లింగంపల్లి.





























