అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆలయంలో 19 ఏళ్ల టీనేజర్ అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ తన వద్ద ఉన్న గన్తో సామూహిక కాల్పులు జరపాలని భావించాడు. కానీ గన్ జామ్కావడంతో అతని ప్లాన్ విఫలమైంది. ఈ ఘటనలో ఆ నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన పట్ల ఇవాళ భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ వ్యతిరేక, వివక్షపూరిత ప్లాన్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొన్నది. ఆ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మీడియాను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

ఇలియనాస్ ఘటన అమెరికాలో భారతీయుల పట్ల ఉన్న విద్వేషాన్ని చూపిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వం విద్వేష పూరిత హింస పట్ల జీరో టాలరెన్స్ చూపించాలని, భారతీయులకు భద్రత కల్పించాలన్నారు. అరోరా టెంపుల్లో సామూహిక కాల్చివేతకు ప్లాన్ చేసిన నిందితుడి ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతనిపై నమోదు చేసిన కేసులను కూడా పరిశీలిస్తున్నామని రణధీర్ తెలిపారు. అమెరికాలో ఇండియాపై ద్వేషం పెరుగుతోందన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి, బాధ్యులైనవారికి శిక్షపడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రణధీర్ జైస్వాల్ కోరారు.















