అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు. రాయబార కార్యాలయం నుంచి పొందే సేవలకు గానూ కొందరు ట్రావెల్ ఏజెంట్లు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని వీరు వమ్ము చేస్తున్నారని పేర్కొన్నారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులు, వీసాలు, పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించేం దుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలిపారు.
రాయబార కార్యాలయం నుంచి అందే సేవల కోసం ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, నేరుగా కార్యాలయానికి వచ్చి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ-వీసా సేవలకు సంబంధించి కూడా 140 కి పైగా నకిలీ వెబ్‌సైట్‌లను గుర్తించామని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రవాస భారతీయులకు సూచిం చారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులకు సులభంగా సేవలు అందించేందుకు ప్రమిత్, భారతి చాట్‌బోట్ వంటి టూల్స్‌తో పాటు మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు, న్యాయ, వైద్య సమాచారం కూడా అందిస్తున్నట్టు చెప్పారు.
ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం రాయబార కార్యాలయం 17 డాలర్లు తీసుకుంటుండగా, కొందరు ట్రావెల్ ఏజెంట్లు 450 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు ట్రావెల్ ఏజెంట్లు కాన్సులేట్ నుంచి సేవలు ఇప్పించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారని తెలిపారు. గుర్తింపు, నివాస ధ్రువీకరణ, యుటిలిటీ బిల్లులకు సంబంధించి దరఖాస్తుదారుల తరపున, వారికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వీటి వల్ల దరఖాస్తుదారులు అమెరికాలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉందని తెలిపారు.