కెనడాలో గుర్తుతెలియని దుండగులు ఓ భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. దక్షిణ వాంకోవర్‌లో చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థి దుండగుల చేతిలో హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఘటనాస్థలం నుంచి తమకు సమాచారం వచ్చిందని, దీంతో అక్కడికి వెళ్లగా కారులో విగత జీవిగా పడున్న చిరాగ్ అంటిల్ కనిపించాడని వాంకోవర్ పోలీసులు పేర్కొన్నారు. చిరాగ్ ఉన్నత చదు వుల నిమిత్తం 2022 సెప్టెంబర్‌లో కెనడా వెళ్లారు. యూనివర్సిటీ కెనడా వెస్ట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న అతడికి కొద్ది రోజుల క్రితమే వర్క్ పర్మిట్ కూడా వచ్చింది. తూర్పు 55వ అవెన్యూ నుంచి తుపాకీ కాల్పులు విన్నానని మాకు కాల్ వచ్చింది. ఇప్పటివరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు. కేసు దర్యాప్తులో ఉంది అని పోలీసులు తెలిపారు.
కాగా, హర్యానాలోని సోనిపట్‌లో ఉంటున్న చిరాగ్ కుటుంబానికి అతడి హత్య గురించి తెలియడంతో వారు తల్లడిల్లిపోయారు. మృతదేహాన్ని భారత్‌కు రప్పించాని ప్రభుత్వాన్ని కోరారు. 2022లో ఎంబీఏ చదివేందుకు చిరాగ్ స్టడీ వీసాపై కెనడా వెళ్లినట్లు సోదరుడు తెలిపారు. వాంకోవర్‌లో డిగ్రీ పొందిన అతడు అక్కడ జాబ్ చేస్తున్నాడని వెల్లడించారు. హత్యకు గురైన రోజున కూడా చిరాగ్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.