
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగరతీరం ముస్తాబయింది. రికార్డు స్థాయిలో ఒకేచోట ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26. కి.మీ. పరిధిలో బారికేడ్లు, రహదారిపై మ్యాట్‌లు, విద్యుద్దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 6.25 గంటలకు యోగాంధ్ర`2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. తొలుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత 6:45 నిమిషాల వరకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఏడు గంటలకు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు.

గురువారం పలువురు మంత్రులు, అధికారులు, ప్రజలు బీచ్‌రోడ్డులో వాక్‌థాన్ నిర్వహించారు. తరువాత యోగాసనాలు సాధన చేశారు. గవర్నర్ అబ్దుల్‌నజీర్ విశాఖ చేరుకుని, నోవాటెల్ హోటల్లో బస చేశారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు.
