పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి ఎంతో సమయం లేద ని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. సిరియా రాజధాని డమాస్కస్ లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ఇరాన్ ఆదివారంలోగా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తున్నదని అమెరికా, ఇతర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యం లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడంతోపాటు పశ్చిమాసియాలోని తమ బలగాలను కాపాడుకొనేందుకు అమెరికా రెండు విధ్వంసక యుద్ధ నౌకలు, ఇతర సామగ్రిని తూర్పు మధ్యదరా సముద్రానికి తరలించింది.