అమెరికా వెళ్లాలి, డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అని భారత్‌లోని సగటు యువతలో చాలామంది ఆశపడుతూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్కడి విదేశీ విద్యార్థులు, యువత ఆశలపై నీళ్లు చల్లడం ప్రారంభించారు. హెచ్-1బీ వీసా చార్జీలు అనూహ్యంగా పెంచడమే కాక, విద్యార్థి వీసాలపై వచ్చే వారిపై కఠిన నిబంధనలు విధించారు. దీంతో అక్కడ ఉంటున్న ఇండియన్స్ సహా ఇతర దేశస్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గడమే కాక, ఆ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది.

బడా కంపెనీలు కూడా హెచ్-1బీ వీసా కింద నియామకాలు తగ్గించి స్థానికులనే నియమించుకోవడం మెల్లిగా ప్రారంభించాయి. డాలర్ల సంపాదన లక్ష్యానికి ట్రంప్ దెబ్బకొట్టడంతో అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పోనీ ఎలాగోలా వెళ్దామని దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది విద్యార్థుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. వీసాల తిరస్కరణ డాటాను పరిశీలిస్తే, ప్రాంతాల వారీగా వాటిలో అసమానతలు పెరుగుతున్నాయన్న విషయం వెల్లడవుతున్నది. దీనివల్ల అమెరికాలో విద్యావకాశాలు యోగ్యత, ప్రతిభ కంటే భౌగోళిక పరిస్థితుల వల్లే ఎక్కువగా ప్రభావితమవుతున్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.















