Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌… ఆయ‌న ఎవ‌రంటే ?

అన్నీ అనుకున్నట్లు జరిగితే బ్రిటన్‌ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు అధికార పీఠం నుంచి దిగిపోయారు. బోరిస్‌కు వ్యతిరేకంగా 40 మందికి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో ప్రధాని పదవికీ రాజీనామా చేస్తున్నట్లు జాన్సన్‌ ప్రకటించారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బోరిస్‌ ఆ పదవిలో కొనసాగనున్నారు.  దీంతో తదుపరి ప్రధాని ఎవరా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించే అవకాశముంది.

                అయితే బ్రిటన్‌ కొత్త ప్రధాని రేసులో రిషి సునక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 42 ఏండ్ల రిషి సునక్‌ను 2020, ఫిబ్రవరిలో బోరిస్‌ జాన్సన్‌ తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమించిన విషయం తెలిసిందే.  కరోనా విజృంభణ సమయంలో ప్రజలు,  ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను రిషి ప్రకటించారు. ఆ సమయంలో  ఆయన పాపులర్‌ అయ్యారు.  బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు కూడా. అలా బ్రిటన్‌ ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. ఇక రిషి సునక్‌ గ్రాండ్‌ పేరెంట్‌స పంజాబ్‌ పూర్వీకులు, ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్‌ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కాలిఫోర్నియాలో చదువుకున్నప్పుడు ఏర్పడిన పరిచయం, వివాహానికి దారి తీసింది.

                తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్‌తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌ ముందంజలో ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ  మంత్రి లిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌, ఆర్థికమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నదీమ్‌ జహావీ, మాజీ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి సునాక్‌ ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత వరుసగా మంత్రుల రాజీనామాల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రధాని పేరులో సునాక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events