ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహిళలకోసం నిర్వహించిన టి7 ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో మహిళలు తమ ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆగస్టు 25వ తేదీన నార్త్ కరోలినాలోని కన్‌కోర్డ్ లో ఉన్న కెజిఎఫ్ గ్రౌండ్‌లో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజుగా 150 డాలర్లను నిర్ణయించింది. విజేతలకు 275 డాలర్లు, రన్నర్‌కు 150 డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.
తానా టి7 మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో మహిళా క్రికెటర్ల అద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభను చూసి చాలామంది వారిని హుషారు పరిచారు. క్రీడలపై ఉన్న అభిరుచితో తమ కుటుంబ బాధ్యతలను ఓవైపు చూసుకుంటూనే మరోవైపు తమ క్రీడా ప్రతిభను అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. తానా నిర్వహించి ఈ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ లో కూడా మహిళలు తమ ప్రతిభను చాటారు. ఈ టోర్నమెంట్ లో 8 టీమ్‌లు పాల్గొన్నాయి. శ్రీనాథ్ దేవర సెట్టి, శరత్ కామెంటరీ అందరినీ ఆకట్టుకుంది. ఈ పోటీల్లో విజేతలుగా స్మైలింగ్ స్రైకర్స్, రన్నర్స్‌గా మాస్టర్ బ్లాస్టర్ నిలిచాయి. ఈ పోటీలకు వలంటీర్లుగా హాసిని నాగుబోయిన, శ్రీజ వంగల, కీర్తన కొత్తపల్లి వ్యవహరించారు. తానా మహిళా నాయకులు మాధురి ఏలూరి, అనూరాధ గుంటుబోయిన, అమూల్య కుడుపూడి, వసంత కావూరి తదితరులు ఈ పోటీల విజయవంతానికి సహకరించారు.
డాక్టర్ సుధ ఈడుపుగంటి (డెంటిస్ట్), పినివిల్లె డెంటల్ స్టూడియో, రియల్టర్ బాలాజీ తాతినేని, రియల్టర్ మోహన్ దగ్గుబాటి ఈ పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తానా ఇలాంటి పోటీలను మహిళలకోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరారు. బ్యాడ్మింటన్, పికెల్ బాల్, త్రోబాల్ టోర్నమెంట్‌ను మహిళలకోసం కూడా నిర్వహిస్తున్నట్లు తానా నాయకులు ప్రకటించారు.